రైతులను చంపించి కపట దీక్షలా?

June 10, 2017


img

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ నేటి నుండి నిరాహార దీక్షకు కూర్చోవడంతో, ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసకందంగా మారాయి. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి గాంధేయవాదమే సరైన మార్గమని చెపుతూ ముఖ్యమంత్రి తన అర్ధాంగితో కలిసి నిరాహార దీక్షకు కూర్చొంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తోంది. మద్దతు ధర అడిగినందుకు పోలీసుల చేత రైతులను కాల్చి చంపించి, ముఖ్యమంత్రి ఇప్పుడు కపట దీక్షలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ముందు ఆ కపటనాటకాలు కట్టిబెట్టి చనిపోయిన రైతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి, రైతులు కోరినట్లుగా వారి పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని, వారి పంట రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన రైతులకువ్యతిరేకంగానే ఈ దీక్ష చేస్తూ మళ్ళీ దానికి గాంధీజీ పేరు తగిలించుకోవడం హాస్యాస్పదంగా ఉందని వాదిస్తున్నారు. రైతులను చంపించినందుకు ముందుగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మరోపక్క రైతులు కూడా తమ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ దాదాపు 15 సం.లుగా మధ్యప్రదేశ్ లో కాలుపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఇప్పుడు ఊహించనివిధం ఈ అవకాశం అందిరావడంతో చెలరేగిపోతోంది. కనుక పైకి ఇది రైతుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటంలాగ కనిపిస్తున్నప్పటికీ ఇది రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఆధిపత్య పోరే అని చెప్పవచ్చు. మరి ఈ ఆధిపత్య పోరులో చివరికి ఎవరు నెగ్గుతారో..చివరికి రైతులు ఏమవుతారో చూడాలి.  


Related Post