మియాపూర్ భూకుంభకోణం వెనుక ఎవరి హస్తం ఉంది?

May 31, 2017


img

మియాపూర్ భూకుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వివరణ చాలా హాస్యాస్పదంగా ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. సుమారు 700 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు జరిగిపోతే, అవి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోలేదని, వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోనేందుకే ప్రభుత్వ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం చూస్తుంటే ఆయనే స్వయంగా అవినీతిపరులను వెనకేసుకువస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఈ బారీ కుంభకోణం వెనుక ఎవరెవరు పెద్దలు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలు లేనిదే ఇంతబారీ కుంభకోణం జరిగే అవకాశం లేదని ఉత్తం కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో కూడా బారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని హెచ్చరిస్తున్నా తెరాస సర్కార్ ఎంతసేపు ఎదురుదాడి చేస్తూ తమ నోళ్ళు మూయించాలని ప్రయత్నిస్తోందే తప్ప అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరమని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. 

ఇక మిగులు బడ్జెట్ తో చేతికి అందిన రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ను తెరాస సర్కార్ తాకట్టు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 40,000 ఉపాద్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణా జర్నలిస్టుల వేదిక అధ్వర్యంలో ‘మూడేళ్ళ తెలంగాణా’ అనే అంశంపై నిన్న జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో ఉత్తం కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జూలకంటి రంగారెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణతో సహా ఇంకా అనేకమంది పాల్గొన్నారు. వారందరూ తెరాస సర్కార్ పనితీరు, హామీల అమలు, అవినీతి వంటి వివిధ అంశాలపై మాట్లాడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరి వారి విమర్శలకు తెరాస ఏమని సమాధానం చెపుతుందో చూడాలి. 


Related Post