బాహుబలి కాదు ట్రంప్: జానారెడ్డి

May 30, 2017


img

“వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో బాహుబలి రాబోతున్నాడు,” అని కొన్ని రోజుల క్రితం సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చెప్పిన మాటలు ఎంత హిట్ అయ్యాయో అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ట్రంప్ లాగ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. “అయితే ట్రంప్ అంటే ఒక వ్యక్తే కానీ ఇక్కడ ట్రంప్ అంటే కాంగ్రెస్ పార్టీ అని అర్ధం’ అని వివరించారు జానారెడ్డి. అందరూ హిల్లరీ క్లింటన్ గెలుస్తారని ఊహించారని కానీ చివరకు అనూహ్యంగా ట్రంప్ గెలిచాడని, అలాగే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కూడా ట్రంప్ లాగ అనూహ్యంగా గెలువబోతోందని చెప్పారు.

తెలంగాణా ఏర్పడితే తమ సమస్యలు, ఆకాంక్షలు తీరుతాయని ప్రజలు చాలా ఆశపడ్డారని, కానీ మూడేళ్ళు గడిచినా రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయని జానారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల, నిరుద్యోగుల, ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎప్పుడూ ఎన్నికల గురించే ఆలోచిస్తూ అందుకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. అందుకే నిత్యం సర్వేలు చేయించుకొంటున్నారని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గుర్తించి వాటికి అనుగుణంగా పని చేస్తే ప్రజలే నెత్తిన పెట్టుకొంటారని, ప్రజలను మెప్పించడం కోసం వేరేగా ప్రయత్నాలు చేయనవసరం లేదని జానారెడ్డి అన్నారు.

తెరాస పనితీరును ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. వారు ఎవరికీ ఓటు వేసి గెలిపించుకోవాలో వారికి బాగా తెలుసు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని మేము నమ్ముతున్నాము,” అన్నారు జానారెడ్డి. కానీ ఆయన కూడా వచ్చే ఎన్నికల గురించే ఇదంతా మాట్లాడుతున్న సంగతి మరిచిపోయినట్లున్నారు. అంటే ఎన్నికల గురించి తాము మాట్లాడవచ్చు..సన్నాహాలు చేసుకోవచ్చు కానీ తెరాస చేసుకోవడం తప్పు అని చెపుతున్నట్లుంది. 

తెదేపాతో పొత్తుల గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “ముందుగా దాని గురించి పార్టీలో అందరం మాట్లాడుకొన్నాక నిర్ణయం తీసుకొంటాము. అయినా ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. తెదేపాతో పొత్తుల గురించి జైపాల్ రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరించబడినట్లు భావిస్తున్నాను,” అని జానారెడ్డి అన్నారు. అంటే ఆయన కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడానికి అంత సముఖంగా లేరని అర్ధం అవుతోంది. 



Related Post