తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ప్రసంగాల గురించి కొత్తగా చెప్పుకోవలసిందేమీ లేదు.కానీ వారిలో కేసీఆర్ కు మంచి వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకొన్నట్లుగా చంద్రబాబు మాట్లాడలేరు కానీ మైక్ పట్టుకొంటే..అది శాసనసభ అయినా..బహిరంగ సభ అయినా..సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తారని అందరికీ తెలిసిందే. అది కూడా ఎక్కువగా స్వోత్కర్షతోనే సాగుతుంటుంది. అది కూడా నిత్యం చెప్పే విషయాలే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న మహానాడు సభలలో కూడా చంద్రబాబు ప్రసంగాలు ఆవిధంగానే సాగాయి.
ఆదివారం మహానాడు సభలో తెదేపా నేత గద్దె బాబురావు సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నప్పుడు, చంద్రబాబు మద్యలో కలుగజేసుకొని సుదీర్ఘమైన ప్రసంగాలతో మహానాడుకు వచ్చినవారిని బోర్ కొట్టించవద్దని సూచించడంతో ఆయన అర్ధంతరంగా తన ప్రసంగాన్ని ముగించవలసి వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకొనేవిధంగా మాట్లాడటం నేర్చుకోవాలని తెదేపా నేతలకు సూచించారు.
బాబురావు ఒక్కరే కాదు.. మహానాడులో మాట్లాడిన చాలా మంది తెదేపా నేతలు చంద్రబాబును ఆయన పరిపాలనను పొగుడుతూ, ప్రతిపక్షాలను విమర్శించడానికే పరిమితం అయ్యారు తప్ప పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడేవిధంగా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వలేదు. సాధారణంగా మన దేశంలో అన్ని పార్టీల సభలు ఇంచుమించు ఇదేవిధంగా సాగుతుంటాయి. కనుక తెదేపా సభలను తప్పు పట్టడానికి లేదు కానీ పసలేని సుదీర్గ ప్రసంగాలు చేసే చంద్రబాబు పార్టీ నేతల ప్రసంగాలను విని అసహనానికి లోనవడమే విచిత్రం.అయన ప్రసంగిస్తున్నప్పుడు కూడా తెదేపా నేతలు, కార్యకర్తలు బహుశః అలాగే ఫీల్ అవుతుంటారేమో? కానీ ఆయన ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు కనుక ఎవరూ ఆయన ప్రసంగాలను వేలెత్తి చూపే సాహసం చేయలేరు. చేస్తే వారు ఆయనకు అదే సలహా ఇచ్చి ఉండేవారేమో?