ఎన్నికల ప్రస్తావన ఇప్పుడెందుకు సార్?

March 10, 2017


img

నేటి నుంచి తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతునందున నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణా భవన్ లో తెరాస శాసనసభా పక్ష సమావేశం జరిగింది. దానిలో కేసీఆర్ శాసనసభ్యులను, మంత్రులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, శాసనసభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే విధంగా అందరూ తమ తమ శాఖలు, నియోజక వర్గాల గురించి పూర్తి సమాచారంతో తయారై రావాలని అన్నారు. ప్రతిపక్షాల సవాళ్ళను, విమర్శలను, ఆరోపణలను తెరాస సభ్యులు బలంగా త్రిప్పి కొట్టాలని సూచించారు. గత శాసనసభ సమావేశాలలో చాలా చక్కగా వ్యవహరించిన శ్రీనివాస్ గౌడ్, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు  ప్రశాంత్ రెడ్డిలను ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకొన్నారు. ఈసారి తెరాస తరపున వారిద్దరే గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే చర్చలో ప్రధానం మాట్లాడాలని కోరారు. సభ్యులు అందరూ తప్పనిసరిగా సభకు అరగంట ముందుగానే చేరుకొని, తాము మాట్లాడినవలసిన అంశాలపై సిద్దంగా ఉండాలని కోరారు. ఈ సమావేశాలలోనే ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రవేశపెడదామని తెరాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు. 

నేటి నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి కనుక దానిలో సభ్యులు ఏవిధంగా వ్యవహరించాలో పార్టీ, ప్రభుత్వ అధినేత నేతగా కేసీఆర్ చెప్పడం సమంజసమే. వారికి ఉత్సాహం కలిగించేందుకు ప్రభుత్వ పని తీరు అద్భుతంగా ఉందని, రాష్ట్రం 19.5 శాతం వృధ్ధి రేటుతో దూసుకుపోతోందని చెప్పడాన్ని కూడా ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెరాసకు 101-106 సీట్లు తప్పక గెలుచుకొంటామని చెప్పడమే కొంచెం అసందర్భంగా ఉంది. తెరాస ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచేందుకే కేసీఆర్ ఆ మాట చెప్పినప్పటికీ, కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళవచ్చని ప్రతిపక్షాలు చేస్తున్న ఊహాగానాలకు అది బలం చేకూర్చుతున్నట్లుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెరాస అన్ని సీట్లు గెలుచుకొంటుందని చెపుతున్నారు కనుక ఆయన ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తించినట్లయింది. ఎన్నికలకు సుమారు రెండేళ్ళపైనే వ్యవధి ఉన్నప్పుడు కేసీఆర్ నోట ఈ ఎన్నికల ప్రస్తావన రావడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తునట్లుంది. 

ఇక వచ్చే ఎన్నికలలో తెదేపా, భాజపాలకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేవని కేసీఆర్ చెప్పడం ఆ రెండు పార్టీలకు కొత్త ఆయుధాలు అందించినట్లయింది. అవి ఈ ముక్క పట్టుకొని తెరాసపై విమర్శలు కురిపించవచ్చు. ఏమైనప్పటికీ పార్టీ, ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ శాసనసభలో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై తన ఎమ్మెల్యేలకు చాలా చక్కగా మార్ధదర్శనం చేసారని చెప్పవచ్చు. 


Related Post