ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో షీతల్ అనే మహిళకి బ్రంపూరి ఎస్.బి.ఐ. బ్రాంచిలో జన్ ధన్ ఖాతా ఉంది. ఆమె ఒక ఫ్యాక్టరీలో రోజువారి కూలీగా పనిచేస్తున్నారు. ఆమె ఖాతాలో బ్యాలన్స్ రూ. 99,99,99,394 ఉన్నట్లు ఎటిఎం స్లిప్ లో చూపడంతో ఆమె తన భర్తతో కలిసి బ్యాంక్ మేనేజర్ ని కలిసి ఆ సంగతి చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోవడంతో నేరుగా ప్రధాని మోడీకి ఈ విషయం తెలియజేస్తూ ఒక లేఖ వ్రాశారు. ప్రధాని కార్యాలయం నుంచి జవాబు రాలేదు కానీ ఈలోగా ఈ వార్త దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. అప్పుడు గానీ సదరు బ్యాంక్ అధికారులు స్పందించలేదు. అప్పుడు కూడా వారి స్పందన, వారు చెప్పిన సాంకేతిక అంశాలు ఆ దంపతులను అవహేళన చేసేవిగా ఉండటం గమనార్హం.
ఆమె ఖాతాలో కేవలం రూ.611 మాత్రమే మిగిలి ఉందని, అటువంటప్పుడు తదుపరి లావాదేవీలు చేయకుండా ఆపేందుకు మైనస్ అమౌంట్ ని చూపిస్తామని సదరు బ్యాంక్ అధికారులు చెప్పారు. కేవైసీ సమాచారం నింపేందుకు కూడా ఖాతాలలో ఆవిధంగా మైనస్ అమౌంట్ చూపిస్తుంటామని చెప్పారు. ఆమె ఖాతాలో ఇంకా రూ. 99,99,99,394 ఉన్నట్లు చూపించిన మాట వాస్తవమని, కానీ ఆ అమౌంట్ పక్కన “చిన్న మైనస్” గుర్తు కూడా పెడుతుంటామని, ఆమె దానిని గుర్తించకపోవడం వలననే తన ఖాతాలో అంత డబ్బుని ఎవరో జమా చేసి ఉంటారని అపోహ పడ్డారని బ్యాంక్ అధికారులు వివరించారు.
ఇది ఒక నిరుపేద మహిళతో ాబ్యాంకులు ఈవిధంగా పరాచకం ఆడటం భావ్యమా ఒకవేళ ఆమె ఖాతాలో తగినంత బ్యాలన్స్ లేకపోతే, అదే విషయం ఆమె పాస్ బుక్ లో చూపించాలి కానీ రూ. 99,99,99,394 ఉన్నట్లు చూపించి దాని పక్కన మైనస్ గుర్తు పెట్టామని, అది చూసుకోకపోవడం మీ తప్పేనని చెప్పడం వితండ వాదనే. సామాన్యుల పట్ల వారికున్న చులకన భావానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిని సాంకేతిక అంశంగా బ్యాంకులు సమర్ధించుకోవచ్చునేమో కానీ ఖాతాదారుల విజ్ఞత పట్ల చులకన భావం ప్రదర్శించడమేనని చెప్పక తప్పదు.
అసలు ఎస్.బి.ఐ.తో సహా అన్నీ జీరో బ్యాలన్స్ అకౌంట్లు నిర్వహించుకొనేందుకు అనుమతిస్తున్నప్పుడు ఆమె ఖాతాలో ఇంకా రూ.611 మిగిలి ఉన్నప్పుడు ఈ విధంగా రూ. 99,99,99,394 ఉన్నట్లు చూపించవలసిన అవసరం ఏమిటి? మళ్ళీ ఆమెను అపహాస్యం చేయడం దేనికి? ఆమె చాలా నిరుపేద మహిళ అయినప్పటికీ చాలా నిజాయితీగా వ్యవహరించింది. దానిని ఆ బ్యాంక్ గుర్తించి ఆమెని గౌరవించకపోగా ఆమె ఆ కోట్లు పక్కన వేసిన మైనస్ గుర్తును చూడకుండా అందరినీ కంగారు పెట్టింది అని అవహేళన చేయడం చాలా శోచనీయం.
విజయ్ మాల్యా వంటి అవినీతిపరులు బ్యాంకులకి రూ.9000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోతే దానిని రాబట్టుకొనేందుకు బ్యాంకులు వారి కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలాడుకొంటాయి. కానీ షీతల్ ఒక నిరుపేద మహిళ అయినప్పటికీ తన ఖాతాలో రూ.100 కోట్లు పడ్డాయని తెలియగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోకుండా, చాలా ఆందోళనతో వెంటనే ఆ విషయం బ్యాంక్ మేనేజరుకి చెప్పే ప్రయత్నం చేయడం ఆమె నిజాయితీకి గొప్ప నిదర్శనం. విజయ్ మాల్యాకి ఆమెకి ఉన్న తేడా అదే.