జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీలు, వాటి నాయకులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ధీటుగా, హుందాగా జవాబిచ్చారు.
“ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచయినా పోటీ చేసే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. కనుకమే జనసేన 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది. మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా పోటీ చేసింది కదా? పోటీ చేస్తే మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? లేదు కదా? మరెందుకీ చిల్లర మాటలు?
కానీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి మరో ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు అక్కడి ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, వారి సమస్యలు, వారి పోరాటాలు మొదలైనవాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని గౌరవించడం చాలా అవసరం. కానీ తెలంగాణలో పోటీ చేస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేదన్నట్లు మాట్లాడుతుంటారు.
ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదని అన్నారు. మరి ఆనాడు పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేయడం కూడా ప్రాంతీయవాదమేనా? మేము కష్టపడి తెలంగాణకు తెచ్చుకున్న పరిశ్రమలు, పెట్టుబడులను ప్రధాని మోడీ గుజరాత్‌కి తరలించుపోయారు. అదీ ప్రాంతీయవాదమే కదా?
తెలంగాణలో అందరికీ చోటు ఉంది. అందరినీ మేము గౌరవిస్తాము. కానీ ఇక్కడకు వచ్చి తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహిస్తారనుకున్నారా? ఇక్కడ మీ ఆస్తులున్నాయి.
ఈ 12 ఏళ్ళలో ఎప్పుడైనా ఎవరైనా వాటి జోలికి వచ్చారా? ఓ నటుడుగా, ఓ పార్టీ అధినేతగా, పొరుగు రాష్ట్రపు డెప్యూటీ సిఎంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాము. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దు,” అని కేటీఆర్ సున్నితంగా హెచ్చరించారు.