జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తర్వాత ఊహించినట్లే రెండు పార్టీల నేతలు ఘాటుగా బదులిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మిస్టర్ పవన్ కళ్యాణ్ యస్.. తెలంగాణ మా అయ్య జాగీరే. మీరొక పెయిడ్ ఆర్టిస్ట్ కనుక బిజేపి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు. ఒకవేళ నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను కూడా మీ చేత మాకు అనుకూలంగా మాట్లాడించుకునేవాడిని కానీ లేదు. వచ్చే ఎన్నికలలో జనసేన, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని మాకు తెలుసు. మీరు ఆ రెండు పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు,” అని అన్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఇదివరకు కూడా తెలంగాణలో పర్యటించారు. చాలాసార్లు పార్టీ సమావేశాలు పెట్టుకున్నారు. అప్పుడెవరూ అడ్డుకోలేదు కదా? అప్పుడు లేని సమస్య నిన్న సమావేశం పెట్టుకుంటే ఎందుకు వస్తుంది. ప్రజల దృష్టి మళ్ళించేందుకే రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఈ డ్రామా నడిపించారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరు విమర్శించారో వారికే సమాధానం చెప్పాలి కానీ యావత్ తెలంగాణ ప్రజలని విమర్శిస్తున్నట్లు మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో బిజేపి, టీడీపితో కలిసి పనిచేస్తున్నారు కనుక తెలంగాణలో కూడా బిజేపితో కలిసి పనిచేస్తే విచిత్రం కాదు కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆ రెండు పార్టీల నేతలు ఆరోపిస్తుండటం గమనిస్తే వారు మూస రాజకీయ ఆలోచనా ధోరణి నుంచి ఇంకా బయటపడలేదని అర్ధమవుతోంది.