జీవన్ రెడ్డి ఆగ్రహం సహేతుకమేగా?

January 22, 2026


img

హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలతో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించారు.

అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన జగిత్యాల (బీఆర్ఎస్‌ పార్టీ) ఎమ్మెల్యే సంజయ్ కూడా వచ్చారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న ఈ కాంగ్రెస్‌ సమావేశానికి ఆయనని ఎలా అనుమతిస్తారంటూ సీనియర్ కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. మహేష్ కుమార్‌ గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తదితరులు ఆయనకు నచ్చజెప్పబోయారు. కానీ ఆయన నిరసన తెలియజేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవలే ఆయన (సంజయ్) స్పీకర్‌కి ఇచ్చిన అఫిడవిట్‌లో తాను పార్టీ మారలేదని నేటికీ బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. అటువంటప్పుడు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేని గాంధీ భవన్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ సమావేశానికి ఎలా అనుమతిస్తారు?

ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేని పక్కన కూర్చోపెట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు గురించి చర్చించడం ఏమిటి?ఆయన లోనికి రాగానే నేను అభ్యంతరం చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశాను,” అని చెప్పారు.


Related Post