తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న మండలి వేదికగా బీఆర్ఎస్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టారు.
ఆమె ఏమన్నారంటే, “అంబేద్కర్ విగ్రహం మొదలు సచివాలయం, దాని ఎదుట అమరజ్యోతి, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు వరకు బీఆర్ఎస్ హయంలో ప్రతీ పనిలో భారీగా అవినీతి జరిగింది. ఆ పార్టీ నేతల ఇసుక దందాలకు దళితులు, భూదాహానికి రైతులు బలైపోయారు. వాటి గురించి ఎప్పటికప్పుడు నేను కేసీఆర్‌ని అడుగుతూనే ఉన్నాను. పిర్యాదులు చేస్తూనే ఉన్నాను. కానీ పట్టించుకోలేదు.
గతంలో ఆంధ్రా పాలకుల దోపిడీకి తెలంగాణ, ప్రజలు గురయ్యారు. కనుక కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మనం పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించాలని కేసీఆర్‌కి పదేపదే చెప్పాను. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు.
మనకీ వాళ్ళకీ తేడా ఏముంది? అని ప్రశ్నిస్తుంటే హరీష్ రావు మరికొందరు కలిసి నన్ను నిజామాబాద్‌కు పరిమితం చేసి, తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆంక్షలు విధించి నన్ను కట్టడి చేశారు. నేను హరీష్ రావుపై బహిరంగంగా విమర్శ చేయగానే నన్ను పార్టీలో నుంచి బయటకు వెళ్ళగొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
కేసీఆర్ కోపంతోనే మోడీ ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టింది. దాదాపు మూడేళ్ళు నేను ఈడీ, సీబీఐలతో ఒంటరిగా పోరాడుతుంటే, నాకు అండగా నిలబడాల్సిన పార్టీ నన్ను ఒంటరిగా వదిలిసింది. నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది,” అని అన్నారు.