ఏపీ, విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద కొత్తగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకున్నారు.
ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఈ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంతో జరిపించి నేడు ఈ స్థాయికి తెచ్చారు. మరో 5-6 నెలల్లో ఇక్కడి నుండి పూర్తి స్థాయిలో విమాన సేవలు ప్రారంభమవుతాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
అయితే తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ళ గడిచినప్పటికీ ఇంత వరకు వరంగల్‌తో సహా రాష్ట్రంలో మరో విమానాశ్రయం పనులు కనీసం ప్రారంభం కాలేదు. ఎందువల్ల?
రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏదో వంకతో కేంద్రంపై, ముఖ్యంగా ప్రధాని మోడీపై కత్తులు దూస్తూనే ఉన్నారు. తన పోరాటాలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసమే అని కేసీఆర్ సమర్ధించుకున్నారు. కానీ కేసీఆర్ తన పార్టీ ప్రయోజనాల కోసమే కేంద్రంపై కత్తులు దూశారని అందరికీ తెలుసు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కుమార్తె కవిత చిక్కుకున్నప్పుడు ఆమెని కాపాడుకోవడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బిజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడ్డారు. ఈ విషయం ఆమె స్వయంగా బయటపెట్టారు కదా?
కనుక కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, దాని కంటే సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని స్పష్టమయ్యింది కదా?
కేసీఆర్ అనుసరించిన ఈ విధానం వలననే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, దానినీ కేసీఆర్ తన మాటకారితనంతో ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’గా మార్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.
సరే... కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక పరిస్థితి మెరుగుపడాలి కదా?తెలంగాణలో చక చకా విమానాశ్రయాల నిర్మాణాలు జరగాలి కదా?కానీ ఎందుకు జరగడం లేదు?అంటే ఇప్పుడు కాంగ్రెస్, బిజేపిల రాజకీయ శత్రుత్వం తెలంగాణకు శాపంగా మారింది.
సిఎం రేవంత్ రెడ్డి కూడా అటు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో, ఇటు ప్రధాని మోడీతో నీళ్ళ కోసం యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు. కనుక టీడీపికి చెందిన పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి సహకరిస్తారా? ఒకవేళ ఆయన సిద్దపడినా బిజేపి పడనిస్తుందా?అంటే కాదనే అర్ధమవుతుంది.
కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య సాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో పైచేయి సాధించేందుకు అటు కేంద్రంతో, ఇటు ఏపీతో కయ్యానికి కాలు దువ్వుతుంటే తెలంగాణకు నష్టమే తప్ప లాభం ఉండదు.... ఇందుకు 11 ఏళ్ళుగా అటక మీద పడున్న వరంగల్ విమానశ్రయం దస్త్రాలే నిదర్శనం... కాదా?
Bhogapuram International Airport! Interiors and exteriors.
— #FlyVizag (@flyVizag) January 3, 2026
Beautiful Airport! pic.twitter.com/bC2l2aghz3