పిల్ల కాకులా? ఎంత మాటనేశావు కవితక్క!

January 02, 2026


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదింపజేసుకోవడానికి నేడు శాసనసభ మండలి చైర్మన్ని కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బయట మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ ఉద్యమకారుడైన కేసీఆర్‌ని ఉరి తీయాలని సిఎం రేవంత్ రెడ్డి అంటుంటే నా రక్తం మరిగిపోతోంది. కనుక కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరయ్యి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధీటుగా జవాబు చెప్పాలి.

ముఖ్యంగా నదీ జలాలపై చర్చని ‘పిల్ల కాకులకు’ విడిచిపెట్టరాదు. వారు కేవలం బబూల్ షూటర్స్ మాత్రమే. కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు రాకుండా ఫామ్‌హౌసుకే పరిమితమైతే బీఆర్ఎస్‌ పార్టీ మనుగడ కష్టమే,” అని అన్నారు.

ఆమె చెప్పిన పిల్ల కాకులు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, కేటీఆర్‌, నిరంజన్ రెడ్డి తదితరులని వేరే చెప్పక్కరలేదు. సిఎం, మంత్రులపై ఆమె ఇటువంటి విమర్శలు చేయడం కొత్తకాదు. కనుక వాటిని పట్టించుకోనవసరం లేదు.

ఆమె హరీష్‌ రావుపై కూడా తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. హరీష్‌ రావు గతంలో సాగునీటి శాఖ మంత్రిగా  ఉన్నప్పుడు ఆయన పర్యవేక్షణలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దానిలో అయన భారీగా అవినీతికి పాల్పడి తన తండ్రి కేసీఆర్‌కి చెడ్డపేరు తెచ్చారని ఆమె ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక నదీ జలాలపై శాసనసభలో జరిగే చర్చలో హరీష్‌ రావు పాల్గొనడాన్ని ఆమె ఆక్షేపిస్తున్నట్లు భావించవచ్చు.   

కానీ సాగునీటిశాఖ మంత్రిగా చేసిన హరీష్‌ రావుకు నదీ జలాల పంపిణీ గురించి తెలియదనుకోవడం అవివేకమే అవుతుంది. తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి ఆయనే కారకుడని ఆమె  నమ్ముతున్నారు. కనుక ఆ కోపం, ద్వేషంతోనే ‘పిల్ల కాకులు’ అని ఉండవచ్చు. 

కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు రాకపోతే బీఆర్ఎస్‌ పార్టీ మనుగడ కష్టమని ఆమె చెప్పడం కూడా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీలో లేరు. లేనప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచన దేనికి? అంటే నేటికీ తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని భావిస్తున్నారా? 


Related Post