హరీష్‌ రావుని చంద్రబాబు నాయుడుతో పోల్చిన కవిత!

December 30, 2025


img

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు ముఖ్య కారణాలలో పార్టీకి మూల స్థంభం వంటి హరీష్ రావు పార్టీకి, కేసీఆర్‌కి ద్రోహం చేస్తున్నారని ఆరోపించడం కూడా ఒకటి. బయటకు వెళ్ళిన తర్వాత ఆమె మరింత తీవ్రంగా హరీష్‌ రావుపై మరింత తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 

ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “హరీష్‌ రావు గురించి బీఆర్ఎస్‌ పార్టీలో కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే ఆయన తెలంగాణ చంద్రబాబు నాయుడు వంటివారని. ఏదోరోజు ఆయన కూడా చంద్రబాబు నాయుడులాగే  మేనమామ కేసీఆర్‌కి తప్పక వెన్నుపోటు పొడుస్తారని కార్యకర్తలు అనుకుంటున్నారు,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు. 

హరీష్‌ రావే తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు చేసి కేసీఆర్‌కి చాడీలు చెప్పి తనని బీఆర్ఎస్‌ పార్టీలో నుంచి బయటకు గెంటిచారని కల్వకుంట్ల కవిత పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బలమైన ఆధారాలు ఏవీ చూపడం లేదు. తనను పార్టీ నుంచి బహిష్కరించడమే పెద్ద కారణమన్నట్లు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. 

ఆమె ఆరోపణలకు హరీష్‌ రావు, కేటీఆర్‌, కేసీఆర్‌ ఎవరూ బదులివ్వడం లేదు. కనీసం స్పందించడం లేదు. పైగా కేసీఆర్‌ తనకు కూతురు కంటే హరీష్‌ రావుపైనే పూర్తి నమ్మకం ఉందని నిరూపిస్తున్నట్లు నేడు ఆయనని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడరుగా నియమించారు.

కనుక హరీష్‌ రావు విషయంలో ఆమె  పోరాబడుతున్నారా లేదా కేసీఆర్‌ పోరాబడుతున్నారా? అనే సందేహం కలుగుతుంది. దీనికి కాలమే సమాధానం చెపుతుంది. 

video courtesy: M9

Related Post