హాజరు కోసమే కేసీఆర్‌ శాసనసభకు వచ్చారా?

December 31, 2025


img

ఈసారి శాసనసభ సమావేశాలలో తమ అధినేత కేసీఆర్‌ కూడా పాల్గొంటారని బీఆర్ఎస్‌ పార్టీ మీడియాకు లీకులు ఇచ్చింది. వారు చెప్పినట్లే కేసీఆర్‌ వచ్చారు కానీ పట్టుమని 15 నిమిషాలు కూడా సభలో ఉండలేదు. తన ఛాంబర్‌లో అటండన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. 

దాదాపు పదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌ ఈవిధంగా వ్యవహరిస్తుండటాన్ని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తప్పు పడుతున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు.

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కేసీఆర్‌ని ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ, సభలో ఆయన వద్దకు వెళ్ళి దణ్ణం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. 

వారు తన వద్దకు వస్తున్నప్పుడు కేసీఆర్‌తో సహా సభలో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు... ఒక్క కేటీఆర్‌ తప్ప! కేసీఆర్‌ కూడా సిఎం రేవంత్ రెడ్డి నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. 

శాసనసభ సమావేశాలలో మొదటిరోజున చనిపోయిన సభ్యులకు సంతాపాలు తెలిపి జనవరి 2కి వాయిదా వేశారు. కనుక మొదటి రోజు హాజరు కాకపోయినా జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారా లేదా? అనేది మళ్ళీ సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రాకపోతే నిబంధనల ప్రకారం తన శాసనసభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడం కోసమే కేసీఆర్‌ శాసనసభకు వచ్చి వెళ్ళినట్లు భావించక తప్పదు. 


Related Post