సిఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టి ఏం ప్రయోజనం?

December 25, 2025


img

కేసీఆర్‌ ఫామ్‌హౌసు బయటకొస్తే మళ్ళీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని అందరూ అనుకున్నదే!  

కేసీఆర్‌ నాలుగు రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ‘సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ‘తోలు తీస్తా’నంటూ హెచ్చరించారు. ఊహించినట్లే మంత్రులు ఆయనకు అంతే ఘాటుగా బదులిచ్చారు. మొన్న కోస్గీ సభలో సిఎం రేవంత్ రెడ్డి కూడా వారికంటే చాలా ఘాటుగా బదులిచ్చారు. 

కేటీఆర్‌ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “అమెరికాలో బాత్రూములు కడిగినోడు ఇక్కడ గాలికి తిరుగుతున్నాడు. అతనితో నాకెందుకని పట్టించుకోవడం లేదు. లాగులో తొండలిడిచి కొడ్తా బిడ్డా ఏమనుకుంటున్నావో.

నా సంగతి నీకు తెలియదు. ఇంటికి పోయి నీ నాయనను అడుగు చెప్తాడు. మీ నాయన సింహం లెక్కన గర్జిస్తే నేను భయపడి లోన దాక్కున్నానా? కేసీఆర్‌ గర్జించినట్లు లేదు. గాడిదలు ఒండ్ర పెట్టినట్లుంది,” అని అన్నారు. 

కేసీఆర్‌ని ఉద్దేశ్యించి, “ప్రజలు నిన్ను, నీ పార్టీని పదేపదే బండకేసి బాదినా ఇంకా నీ బుద్ధి మారలేదు. నీ అహంకారం తగ్గలేదు. నువ్వు ఇలాగే ఉండాలి. ఉంటేనే మాకూ మంచిది. నువ్వు మా తోలు తీయడం కాదు. పండక్కి ఊళ్ళో కోడిని కాల్చి కండలు తీసినట్లుగా నీకూ తీసేశారు. నీకు మిగిలింది ఇక ఆ తోలు ఒక్కటే. దానినైనా భద్రంగా కాపాడుకో. లేకుంటే అదీ ఊడిపోగలదు,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

సిఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తనకంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడటం తప్పని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే ‘తోలు తీస్తానంటూ’ రెచ్చగొట్టింది కేసీఆరే కదా? 

కేసీఆర్‌ సమావేశానికి ముందు సిఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “రాజకీయాలలో చాలా సీనియర్, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సిఎం కేసీఆర్‌గారు శాసనసభ సమావేశాలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన సభకి వస్తే ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాదే,” అని చాలా పద్దతిగా విజ్ఞప్తి చేశారు కదా?

అందుకు కేసీఆర్‌ కూడా సానుకూలంగా మర్యాదగా జవాబిస్తే సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈవిధంగా ఆక్షేపించేవారు కాదు కదా?


Related Post