గ్లోబల్ సదస్సు విజయవంతం... ఇక పనులు మొదలుపెట్టాలి

December 10, 2025


img

హైదరాబాద్‌లో సోమ, మంగళవారం రెండు రోజుల పాటు సాగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో మొత్తం రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సదస్సులో లక్ష కోట్లు పెట్టుబడులు వస్తాయనుకుంటే ఆశించిన స్థాయి కంటే చాలా అధికంగా రావడం శుభసూచకం. 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయిందని, అభివృద్ధి నిలిచిపోయిందని బీఆర్ఎస్‌ పార్టీ పదేపదే ఆరోపిస్తోంది. ఒకవేళ అటువంటి పరిస్థితి నెలకొని ఉండి ఉంటే సదస్సుకు ఇంత మంది పెట్టుబడిదారులు వచ్చేవారు కారు కదా?

కానీ రావడమే కాకుండా భారీగా పెట్టుబడులు పెట్టారు కూడా. ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌కి తిరుగులేని నిదర్శనమే. 

ఈ సదస్సు నిర్వహించడం, దానికి ఇంత మందిని రప్పించడం, వారితో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించడం ప్రతీది చాలా క్లిష్టమైన పనే. తెర వెనుక ఎంతో మంది మంత్రులు, అధికారులు చాలా తీవ్రంగా శ్రమిస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కావు. కానీ తెలంగాణ ప్రభుత్వం సాధ్యం చేసి చూపింది! 

ఇప్పుడు ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరూ ఇంతకంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. వాటన్నిటికీ భూములు కేటాయించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతీ ఒక్కటీ ప్రారంభం అయ్యేలా చేయడానికి గట్టిగా ప్రయత్నించాలి. 

ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయింది. చివరి సంవత్సరంలో ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. అప్పుడు బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీల రాజకీయాలు పెరిగిపోతాయి. వాటిని దీటుగా ఎదుర్కోలేకపోతే కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగులుతుంది.

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ ప్రారంభం అయ్యేలా చేయడానికి కేవలం రెండేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. 

ఈ రెండేళ్ళలో ఇవన్నీ ప్రారంభం అయ్యేలా చేసి వాటి ద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలిగితేనే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి మళ్ళీ అధికారం కట్టబెడతారు. లేకుంటే  బీఆర్ఎస్‌ పార్టీ ఉండనే ఉంది. 

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విశ్రాంతి తీసుకునే సమయం లేదు. నేటి నుంచే ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టాలి. అప్పుడే అది పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. లేకుంటే ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అవుతుంది.


Related Post