కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌: ఎవరి తల్లి వారిదే!

December 09, 2025


img

నాడు తెలంగాణ ఉద్యమాలు పతాక స్థాయికి చేరుకోవడంతో ఆ ఒత్తిడికి తలొగ్గి డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దానిని బీఆర్ఎస్‌ పార్టీ ‘విజయ్ దివస్’గా జరుపుకుంటే, అధికార కాంగ్రెస్‌ పార్టీ ‘తెలంగాణ తల్లి దినోత్సవం’గా జరుపుకుంది. 

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో ఒకే పేరుతో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ తమ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భావిస్తుండటంతో రెండింటి దారులు వేరయ్యాయి. 

నాడు కేసీఆర్‌ చావుకి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్‌ దీక్ష విరమించారు. 

కనుక ఆమరణ దీక్ష చేసి కేసీఆర్‌ విజయం సాధించారు. కనుక బీఆర్ఎస్‌ పార్టీ ‘విజయ్ దివస్’ జరుపుకుంటోంది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ నాడు కేసీఆర్‌ ఆమరణ దీక్ష విరమిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు పెట్టి తెలంగాణ సాధన క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకుంటోంది. 

కానీ నాడు సోనియా గాంధీ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తూ స్వయంగా చొరవ తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కనుక నేడు ఆమె పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించారు. 

చారిత్రికమైన ఈ రోజు ప్రాముఖ్యత విషయంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు తమ పార్టీలకు అనుకూల వైఖరితో వ్యవహరించినప్పటికీ తెలంగాణ తల్లి విషయంలో కూడా రెండు పార్టీలు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటం బాధాకరం. తెలంగాణ ప్రజలని అయోమయానికి గురి చేస్తోందని చెప్పక తప్పదు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తమకు ఆమోదయోగ్యం కాదని చెపుతున్న బీఆర్ఎస్‌ నేతలు తమ హయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద విజయ్ దివస్ జరుపుకోగా, కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వం రూపొందించి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకున్నారు. అంటే ఎవరి తల్లి వారిదే... ఒకరి తల్లి మరొకరికి ఆమోదం కాదన్నమాట! 

ఆంధ్రా పాలకులతో విభేదిస్తే అది న్యాయమే, సహజమే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఒకే రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలు, అదీ... రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టీలు ఈవిధంగా వ్యవహరిస్తుండటం వారికీ, వారి పార్టీలకు తెలంగాణ రాష్ట్రానికి, ఆ తల్లికి కూడా గౌరవప్రదమా?


Related Post