కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు

December 09, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరిస్తూనే ఉన్నారు.

కానీ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించారు. ఒక్కో విగ్రహానికి రూ.17.50 లక్షలు చొప్పున మొత్తం రూ.5.88 కోట్లు ఖర్చు చేసి ఈ విగ్రహాలు ఏర్పాటు చేయించారు. 

ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ పట్టుదల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నాడు డిసెంబర్‌ 9న యూపీయే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అందుకే ఆమెకు కృతజ్ఞత తెలుపుతూ ఆమె పుట్టినరోజు వేడుకలతో పాటు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించాము,” అని అన్నారు. 

కనుక సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఆమె పుట్టినరోజు (డిసెంబర్‌ 9)నాడే ఈ విగ్రహావిష్కరణలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పేశారు. ఇదిబీఆర్ఎస్‌ పార్టీ నేతలు జీర్ణించుకోవడం కష్టమే.


Related Post