కేసీఆర్‌ ఉన్నంతవరకే హరీష్ ఉంటారు: కడియం

November 27, 2025


img

స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈరోజు నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేటీఆర్‌ చాలా అహంకారంతో మాట్లాడుతూ, చాలా పొగరుగా వ్యవహరిస్తుంటారు. ఆయన ధోరణి నచ్చకనే పలువురు ఆయనకు దూరమవుతున్నారు.

కానీ అలా మాట్లాడటమే గొప్ప రాజకీయ లక్షణం అని కేటీఆర్‌ అనుకుంటున్నారు. కానీ రాజకీయాలలో ఉన్నవారు అందరితో మర్యాదగా, అణకువగా ఉండాలి. కేటీఆర్‌ నాయకత్వంపై ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవితకే నమ్మకం లేదు. ఇక పార్టీలో మిగిలినవారికి ఏముంటుంది? 

కేసీఆర్‌ ఉన్నంత కాలమే హరీష్ రావు బీఆర్ఎస్‌ పార్టీలో ఉంటారు. ఆయన లేనిరోజున తన దారి తాను చూసుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుంది,” అని కడియం శ్రీహరి అన్నారు. 

హరీష్ రావు పార్టీలో ఉంటూ తన తండ్రికి, అన్నకి శల్య సారధ్యం చేస్తూ పార్టీని నిలువునా ముంచేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంటే, హరీష్ రావు వల్లనే ఇంకా బీఆర్ఎస్‌ పార్టీ నిలబడి ఉంది... అయన లేకపోతే పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందని కడియం శ్రీహరి చెప్పడం విశేషం.

హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డితో టచ్‌లోనే ఉన్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కడియం శ్రీహరి ఆయనని వెనకేసుకు వస్తూ కేటీఆర్‌కి నాయకత్వ లక్షణాలు లేవనడం గమనిస్తే కల్వకుంట్ల కవిత ఆరోపణలలో ఎంతో కొంత వాస్తవం ఉందనిపిస్తుంది.

ఇంతకీ కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నట్లు హరీష్ రావు బీఆర్ఎస్‌ పార్టీని ముంచేస్తున్నారా, కడియం చెపుతున్నట్లు పార్టీని కాపాడుతున్నారా?ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాల్సిందే!

(Video Courtesy: 10TV )


Related Post