తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా ఆయన కూడా ఘాటుగా ఆమెకు బదులిచ్చారు.
ఇంతకాలం ఆమె ఎంతగా విమర్శిస్తున్నా, తీవ్ర ఆరోపణలు చేస్తున్నా హరీష్ రావు, కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ తరపున ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కానీ ఆమె నేరుగా నిరంజన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, దేవుడి భూములు కబ్జా చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఆయన స్పందించక తప్పలేదు.
నిజానికి బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోతే మీడియా కూడా ఆమెను పెద్దగా పట్టించుకోదు. కానీ ఆమె కేసీఆర్ కూతురు కావడం వలన ఆమె చేసే ప్రతీ విమర్శ, ఆరోపణతో ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూనే ఉంటుంది. కనుక ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతూనే ఉంటుంది. అది వేరే సంగతి!
ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. వారి మద్య జరిగిన ఈ చిన్న ఫైట్ మీడియాలో ప్రధానంగా వచ్చింది.
తెలంగాణ రాజకీయాలలో ఏకాకిగా మారి ఒంటరి పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవితకి ఇప్పుడు ఇలాంటి పబ్లిసిటీ చాలా అవసరం. ఇది ఆమె రాజకీయ మనుగడకు, ఎదుగుదలకు పరోక్షంగా ఉపయోగపడుతుంది.
గతంలో షర్మిల కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసేవారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆమెకు పబ్లిసిటీ లభించలేదు. చివరికి తెలంగాణలో దుకాణం మూసేసి ఏపీకి వెళ్ళిపోయారు.
కానీ కల్వకుంట్ల కవిత ఇక్కడ రాజకీయాలు చేయాలి. వేరే ఆప్షన్ లేదు. కనుక జనం బాటలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇలా కత్తులు దూస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగితే, ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం ముగిసేనాటికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వచ్చే ఆమె పంచన చేరవచ్చు. అప్పుడు సొంత పార్టీ పెట్టుకోవచ్చు.
కనుక కల్వకుంట్ల కవిత మొదలు పెట్టిన ఈ యుద్ధంలో ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు. రేపు మరో జిల్లా, నియోజకవర్గంలో మరో బీఆర్ఎస్ నాయకుడిపై ఆమె కత్తులు దూయడం తధ్యం.