సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్నారు. వారిలో 8 మంది లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
దానం నాగేందర్ ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి లేఖ ద్వారా అభ్యర్ధించారు. కనుక స్పీకర్ అనుమతిస్తే ఈ వ్యవహారం మరికొన్ని రోజులు లేదా వారాల పాటు సాగే అవకాశం కనిపిస్తోంది.
పది మందిలో వీరిద్దరిపై అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందునే వారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు సమయం తీసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతోంది.
కానీ వారిలో దానం నాగేందర్ అనర్హత వేటు తప్పించుకోవడానికి రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కనుక ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదన్నారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఓడిపోయినప్పుడు దానం నాగేందర్‌కు మంచి పట్టున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే గెలవగలదా? గెలిస్తే నైతిక విజయమని చెప్పుకోవచ్చు. కానీ ఓడితే తలెత్తుకోగలదా? ఆలోచించుకోవలసిందే!