పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరిని వివరణ కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి నేడు స్పీకర్‌ని కలిసి వివరణ ఇచ్చుకున్నారు. దానం నాగేందర్ కూడా వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
వారిద్దరిలో దానం నాగేందర్ అనర్హత వేటు తప్పించుకోవడానికి రాజీనామా చేస్తారని, కడియం శ్రీహరిని మాత్రం సాంకేతిక అంశాలతో స్పీకర్ కాపాడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిరకాలం పనిచేసిన కేటీఆర్ బహుశ సరిగ్గానే అంచనా వేసి ఉండొచ్చు.
ఒకవేళ దానం నాగేందర్ లేదా పది మందిలో మరెవరు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వస్తాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కనుక మరో ఉప ఎన్నికని వస్తే అది అగ్నిపరీక్షగానే మారుతుంది.
ఒకవేళ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సివస్తే కాంగ్రెస్ పార్టీకి కొంచెం కష్టం, నష్టం కలిగినప్పటికీ ఉప ఎన్నిక వస్తే అది కలిసి వస్తుంది. ఇదే ఊపులో కాంగ్రెస్ పార్టీ మరో రెండు మూడు సీట్లు గెలుచుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీన పడుతుంది. కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితిపై స్పష్టత వస్తే ఉప ఎన్నికలు వస్తాయా లేదా తెలుస్తుంది.