ఇప్పుడు బంతి కాంగ్రెస్‌ కోర్టులోనే ఉంది: బండి సంజయ్‌

November 20, 2025


img

ఎఫ్‌-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ, “ఇంతకాలం బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, రెండూ ఒకటేనంటూ సిఎం రేవంత్ రెడ్డి విమర్శించేవారు. 

నిజానికి అనుమతివ్వకూడదనే సిఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులోకేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. కనుక ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇదివరకు అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తామన్నారు కదా?కేటీఆర్‌ ఆస్తులు జప్తు చేసే సాహసం మీకుందా? కేటీఆర్‌పై చర్యలు తీసుకోగలరా లేదా మళ్ళీ ఏదో కొత్త స్టోరీ చెపుతారా?” అని ప్రశ్నించారు. 

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిపై కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ విషయంలో అడుగు ముందుకు వేసే ముందు రాజకీయ కోణంలో కూడా చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, కల్వకుంట్ల కవిత విమర్శలతో తల్లడిల్లుతున్న కేటీఆర్‌ని ఇప్పుడు అరెస్ట్‌ చేస్తే అది బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ బలపడేందుకు దోహదపడవచ్చు. కాంగ్రెస్‌, బీజేపిలు కలిసి కేటీఆర్‌ని అన్యాయంగా అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్‌ చేశారంటూ బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు రోడ్లేక్కి నిరసనలు, ఆందోళనలు చేపట్టడం ఖాయం. 

కేటీఆర్‌ని అరెస్ట్‌ చేస్తే ప్రజలకు ఆయనపై సానుభూతి కూడా కలుగవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నప్పుడు ఈ పరిణామాలను బీఆర్ఎస్‌ పార్టీ సానుకూలంగా మలుచుకొని లబ్ది పొందగలదు. 

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటీఆర్‌ అరెస్టుకి తొందరపడకపోవచ్చు. కానీ బీఆర్ఎస్‌ పార్టీని దెబ్బ తీయడానికి ఇంతకంటే మంచి అవకాశం లభించకపోవచ్చు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమి చేయబోతోందనేది చాలా ఆసక్తికరంగా మారింది.


Related Post