బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు.
దానిలో భాగంగా ఇప్పటికే ఆరుగు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి వారి వివరణ తీసుకున్నారు. ఈ నెల 19, 20 తేదీలలో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్, 20వ తేదీన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారణకు హాజరై వివరణ ఈయాల్సిందిగా నోటీసులు పంపారు. తదనుగుణం స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందున, ముందుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలలో తప్పకుండా విజయం సాధించగలరనే వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.
కానీ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ అగ్నిపరీక్షగా మారుతుంది. కనుక వారి రాజీనామాలు లేదా అనర్హత వేటు కోసం పట్టుపట్టకపోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ చల్లబడితే తగిన సమయం వచ్చే వరకు ఈ విచారణ తంతుని ఇలాగే మరికొన్ని నెలలు పొడిగించవచ్చు.