తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆయనే భ్రష్టు పట్టించేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని కేటీఆర్ నమ్ముకొని తాము కృష్ణార్జునులమని చెప్పుకుంటున్నారని, ఇద్దరూ దొందూ దొందే అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఆమె విమర్శలు, ఆరోపణల వలన కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. పార్టీ క్యాడర్ నిలువునా చీలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి గురించి కేసీఆర్‌తో చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావు నిన్న ఫామ్‌హౌసుకి వెళ్ళారు. కనుక ఆమె గురించి కూడా చర్చించే ఉంటారు. పార్టీ తరపున అధికారికంగా స్పందిస్తారనుకుంటే, ఎవరూ ఆమెకు జవాబు చెప్పలేదు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా చిన్న మాట అంటే మూకుమ్మడిగా విరుచుకుపడే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కల్వకుంట్ల కవిత విమర్శలకు సమాధానం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ చెపితే ఆమె మళ్ళీ కొత్త విమర్శలు, ఆరోపణలు చేస్తారు. లేదా మరిన్ని రహస్యాలు బయటపెడతారు. దాని వలన పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. కనుకనే మౌనంగా ఉండిపోయారనుకోవచ్చు. కానీ ఆమె అంత సంచలన ఆరోపణలు చేసినప్పుడు వారు ఖండించకపోవడం వలన ఆమె చేసిన ఆరోపణలు నిజమే అని ప్రజలు భావిస్తారు కదా?