జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ 85, 564 సాధించగా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత 64,856 ఓట్లు సాధించారు. కనుక ఆమెపై 23,612 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి కేవలం 10,235 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని అనుకున్నప్పటికీ ఏకంగా 23,612 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ మంత్రులు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, విచ్చలవిడిగా డబ్బు పంచి ఓటర్లను ప్రలోభపెట్టడం వల్లనే ఇంత మెజార్టీ వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక బీజేపి అభ్యర్ధి మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడే తీవ్ర నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు.