జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి కూడా పోలింగ్ శాతం 50 శాతం దాటే అవకాశం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటలకు కేవలం 47.16 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ ముగిసే సమయానికి మరో 2 లేదా 3 శాతం నమోదైతే నియోజకవర్గంలో సగం మంది మాత్రమే ఓట్లు వేశారని స్పష్టమవుతుంది.
మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసినప్పుడు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. వారిని చూసి మూడు పార్టీలు గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశాయి. కానీ ఓట్లు వేయడానికి నియోజకవర్గంలో సగం మంది మాత్రమే వచ్చారు. అంటే మిగిలిన 2 లక్షల ఓట్లు మూడు పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల మద్య చీలిపోబోతున్నాయన్న మాట!
భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆశ పడిన మూడు పార్టీలకు ఈ పోలింగ్ శాతం చాలా నిరాశ కలిగించేదే. ఈ నెల 14న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. ఓటింగ్ శాతం తక్కువ నమోదైంది, అది కూడా ఈవీఎంల ద్వారా జరిగింది కనుక నవంబర్ 14న మధ్యాహ్నం 12 గంటలలోపే ఎవరు విజయం సాధించారో తేలిపోవచ్చు.
కానీ ఎన్నికల ప్రచారంలో భారీ మెజార్టీతో గెలువబోతున్నామని గొప్పలు చెప్పుకున్న నేతలు రేపు ఓడిపోతే ఏం చెప్తారో?