కేసీఆర్‌ ప్రచారానికి రానేలేదు!

November 09, 2025


img

ఈరోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచార గడువు ముగుస్తుంది. మాజీ సిఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మాత్రం పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి రానే లేదు. ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరే మొట్ట మొదట ఉంది, కనుక తప్పకుండా వస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు.

ఇటీవల తండ్రిగారు చనిపోవడంతో హరీష్ రావు కూడా కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. కనుక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచార భారం అంతా కేటీఆర్‌పైనే పడింది. కానీ కేటీఆర్‌ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ప్రతీరోజూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. 

కేటీఆర్‌ ధాటిగా ప్రచారం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్‌ వల్లనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య అన్నట్లు సాగుతోంది. ఒకవేళ కేసీఆర్‌ కూడా వచ్చి ఉండి ఉంటే తప్పకుండా బీఆర్ఎస్‌ పార్టీ పైచేయి సాధించేదేమో? 

ఒకవేళ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాక బీఆర్ఎస్‌ అభ్యర్ధి మాగంటి సునీత ఓడిపోతే, ఆ అప్రదిష్ట ఆయనకే చుట్టుకుంటుంది. ఒకవేళ గెలిచినా ఇదేమీ ఆయనకు గొప్ప కీర్తి తెచ్చి పెట్టదు.

కానీ ఆమెని గెలిపించుకోగలిగితే, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఎదుర్కొని బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించుకున్నారనే క్రెడిట్ కేటీఆర్‌కు దక్కుతుంది. బహుశః అందువల్లే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయారేమో? 

కల్వకుంట్ల కవిత కారణంగా పార్టీలో రేగిన అలజడికి ఈ గెలుపే తగ్గించగలదు. కనుక కేటీఆర్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు నవంబర్‌ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్‌ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.  



Related Post