బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు

November 07, 2025


img

కేంద్ర మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్‌ గురువారం బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనప్పుడు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.

ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలు పక్కన బెడితే, ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిలో కేటీఆర్‌ హస్తం ఉందని గోపీనాథ్ తల్లి స్వయంగా అనుమానిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి విచారణ   జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. 

కేటీఆర్‌ జనతా గ్యారేజ్ సినిమా డైలాగులు చెపుతూ మూడేళ్ళ తర్వాత తన తండ్రి కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడాన్ని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రానివాడు ప్రజలకు అవసరమే లేదన్నారు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న కేటీఆర్‌కి ఆయనని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని చాలా ఆరాటపడుతున్నారని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

అందుకే కల్వకుంట్ల కవిత అందరితో జాగ్రత్తగా ఉండమని తండ్రిని హెచ్చరించారన్నారు. దాంతో ఆమెను కూడా కేటీఆర్‌ బయటకు గెంటేశారని బండి సంజయ్‌ ఆరోపించారు.

బండి సంజయ్‌ కాంగ్రెస్‌ నేతలు, సిఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో 30 శాతం ఉన్న ముస్లింల ఓట్ల కోసం నెత్తిపై టోపీలు పెట్టుకొని ఉత్తుత్తి నమాజులు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

వారిని మెప్పించడం కోసం ఆడుతున్న ఈ డ్రామాలతో వారి మతాన్ని అవమానిస్తున్నారని బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు. తాను ఇతర మతాలను గౌరవిస్తాను కానీ ఈవిదంగా అవమానించనన్నారు.

కేవలం ప్రధాని మోడీ వల్లనే దేశం, రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్‌ అన్నారు.  కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని వాటికి ఓటు బ్యాంక్ రాజకీయాలే తప్ప ప్రజల గోడు పట్టదన్నారు. రెండు పార్టీలు 30 శాతం ముస్లిం ఓట్ల కోసం ప్రాకులాడుతున్నాయి కనుక మిగిలిన 70 శాతం మంది బీజేపికి గంపగుత్తగా ఓట్లేసి గెలిపించాలని కోరారు. 


Related Post