హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు... ఓటర్లు!

November 05, 2025


img

కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో మీడియా సమక్షంలో దేశంలో నకిలీ ఓట్లు, ఓటర్లు ఏవిదంగా మన ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నారో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 

“మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తిస్‌ఘడ్‌ రాష్ట్రాలలో మా పార్టీ అధ్యయనంలో లక్షల కొద్దీ నకిలీ ఓట్లు, ఓటర్లు నమోదైనట్లు గుర్తించాము. కనుక చిన్న రాష్ట్రమైన హర్యానాలో మరింత లోతుగా అధ్యయనం చేస్తే దిగ్బ్రాంతి కలిగించే విషయాలు ఎన్నో బయటపడ్డాయి. 

హర్యానాలోనే 25 లక్షల ఓట్లు దొంగతనం అయ్యాయి. అంటే అసలు ఓటర్ల స్థానంలో నకిలీ ఓటర్లు, ఇతర రాష్ట్రాలలో ఓటర్లుగా ఉన్నవారు పేరుతో ఓట్లు నమోదయ్యాయి. అక్టోబర్‌ 2025లో జరిగిన  హర్యానా శాసనసభ ఎన్నికలలో మా పార్టీ తప్పకుండా 60కి పైగా సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుందనుకున్నాము. 

కానీ అనూహ్యంగా బీజేపి 48 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌ పార్టీకి 35 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈవిదంగా ఎందుకు జరిగిందని మేము లోతుగా అధ్యయనం చేస్తే 25 లక్షల నకిలీ ఓట్లే కారణమని గుర్తించాము. మా ఈ ‘హెచ్-ఫైల్స్’ అధ్యయన నివేదికని మీడియా ద్వారా దేశ ప్రజల ముందుంచుతున్నాను. 

హర్యానాలో మొత్తం 25 లక్షల ఓట్లు దొంగతనం అయ్యాయి. వాటిలో 5.21 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లున్నారు. మరో 19.26 లక్షల మంది బల్క్ ఓటర్లు, 93,174 మంది అనర్హులున్నారు. అంతేకాదు... బ్రెజిల్ దేశానికి మోడల్ మాధ్యూస్ ఫెర్రో 22 పేర్లతో 10 పోలింగ్ బూతులలో 22 సార్లు ఓట్లు వేశారు. ఇదెలా సాధ్యం?

ఒక్క హర్యానాలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈవిదంగా ఓట్ల చోరీ జరుగుతూనే ఉంది. కనుక యువత మేల్కొని దీనిని అడ్డుకోకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది,” అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

కానీ ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. హర్యానాలో ఎన్నికలు జరిగినప్పుడు, ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎన్నడూ ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు ఎందువల్ల?

అయినా ప్రతీ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌ పోలింగ్ ఏజంట్లు కూడా ఉన్నారు కదా? ఒకవేళ నకిలీ ఓటర్లు ఓట్లు వేస్తున్నట్లయితే అప్పుడే అడ్డుకొని పిర్యాదు చేసి ఉండాలి కదా? ఇటువంటి నిరాధారమైన ఆరోపణలతో ఎన్నికల కమీషన్ విశ్వసనీయత దెబ్బ తీయడం సరికాదు,” అని అన్నారు.     


Related Post