ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్‌కి సిఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఆయనకీ మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు లేకపోయి ఉంటే ఆయనకు ఈ పదవి దక్కేదే కాదని రాజకీయ ప్రత్యర్ధులు వాదిస్తున్నారు. ఉప ఎన్నికలలో నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకే సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఈ పదవి కట్టబెట్టారంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి కూడా పిర్యాదు చేశాయి. కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఉప ఎన్నికలు మహ్మద్ అజారుద్దీన్‌కి అదృష్టంగా మారాయని భావించవచ్చు.
ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మంత్రి పదవి లభించలేదు. కానీ మహ్మద్ అజారుద్దీన్ మాత్రం తంతే బూర్లె గంపలో పడినట్లు అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. కనుక ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత ఆగ్రహంతో రగిలిపోతారేమో?