బీజేపిలోకి బొంతు... రెబెల్ అభ్యర్ధిగా అంజన్?

October 10, 2025


img

బీసీ రిజర్వేషన్స్‌ అంశంతో తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించినట్లు కనపడిన కాంగ్రెస్‌ పార్టీకి ఒకేసారి ఊహించని సమస్యలు, కష్టాలలో చిక్కుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఇటు పార్టీలో అంతర్గతంగా, బయట బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది.

సరిగ్గా ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్‌ యాదవ్ ఇద్దరూ తీవ్ర నిరాశ చెందారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు బలమైన అభ్యర్ధి లేక ఇబ్బంది పడుతున్న బీజేపి, బొంతు రామ్మోహన్ని పార్టీలో చేర్చుకొని బీజేపి అభ్యర్ధిగా నిలబెట్టే ఆలోచనలో ఉంది. బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర నాయకత్వానికి ఈ ప్రతిపాదన చేయడం విశేషం. దీనిపై బొంతు రామ్మోహన్, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు రాంచందర్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

మాజీ ఎంపీ అంజన్ కుమార్‌ తనను కాదని నవీన్ యాదవ్‌కి టికెట్ ఇవ్వడాన్ని అయన తప్పు పడుతున్నారు. కనుక అయన కూడా రెబెల్ అభ్యర్ధిగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఉప ఎన్నిక కారణంగా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌ మద్య జరిగిన వివాదం చల్లారిందనుకుంటే ఇప్పుడు ఈ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. 


Related Post