తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు (గురువారం) నోటిఫికేషన్ వెలువడబోతోంది. కానీ బీసీ రిజర్వేషన్స్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనిని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ హైకోర్టులో సుమారు 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టినప్పుడు వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి.
అనుకూల వాదనలు:
1. బీసీ రిజర్వేషన్స్ కోసం మార్చిలో ఒకసారి, ఆగస్టులో మరోసారి గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ ఆమోదించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన చట్ట సవరణలకు 60 రోజులలో గవర్నర్ ఆమోదించకపోతే, ఆటోమెటిక్‌గా ఆమోదం లభించినట్లే పరిగణించవచ్చు.
2. అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో పేర్కొనలేదు. సుప్రీంకోర్టు పేర్కొంది. కనుక బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ హైకోర్టు అనుమతించవచ్చు.
3. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. నేడు నోటిఫికేషన్ వెలువడుతుంది. కనుక ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకోరాదు.
వ్యతిరేక వాదనలు:
1. అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు సొంతంగా చెప్పలేదు. రాజ్యాంగంలో ఉన్నదే చెప్పింది. అందువల్లే సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు రాష్ట్రాలలో ఇటువంటి ప్రతిపాదనలను తిరస్కరించాయి.
2. మంత్రిమండలి గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుని వెనక్కు తిప్పి పంపిన తర్వాత మళ్ళీ ఆమోదం కోసం రెండోసారి ఆయనకు పంపాలి. కానీ ఇది జరగలేదు. కనుక గడువు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దీనికి వర్తించదు.
3. తెలంగాణ ప్రభుత్వం 2024లో బీసీ జనాభా లెక్కలు, 2011లో తీసిన ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లు జీవో 41లో పేర్కొంది. ఒక వర్గానికి రిజర్వేషన్స్ కల్పించేందుకు ఇతర వర్గాలకు అన్యాయం చేయడం చట్ట విరుద్దం. కనుక బీసీ రిజర్వేషన్స్ అమలు చేయరాదు.
బీసీ రిజర్వేషన్స్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు విచారణ కొనసాగించనుంది. కనుక హైకోర్టు తీర్పు ఏవిదంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.