ఆర్టీసీ ఛార్జీల పెంపు, టైమింగ్ రెండూ నష్టమే!

October 05, 2025


img

సోమవారం నుంచి హైదరాబాద్‌ పరిధిలో అన్ని రకాల సిటీ బస్సుల ఛార్జీలు రూ.5 నుంచి 10 వరకు పెంచుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు.

ఇటీవలే బస్ పాసులు ఛార్జీలు పెంచింది. ఇప్పుడు సిటీ బస్ టికెట్ ఛార్జీలు భారీగా పెంచేసింది. సామాన్య ప్రజల ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచేసి వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సామాన్య ప్రజలపై ఇంత కక్ష దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి సిటీ బస్సులు ఎక్కే ప్రయాణికులు కూడా ఇదే ప్రశ్నిస్తారు. 

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ రెండూ పూర్తికాగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. కనుక ఈ ఛార్జీల పెంపు, దీని టైమింగ్ రెండూ సరికావు.

వీటి వలన కాంగ్రెస్‌ పార్టీకి ఈ వరుస ఎన్నికలలో నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక ఛార్జీల పెంపును ఉపసంహరించుకొని లేదా నామమాత్రానికి పరిమితం చేసి ప్రభుత్వమే ఈ భారం భరించడం మంచిదేమో? 


Related Post