ఆటో డ్రైవర్లలో ఒకరిగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌...

October 04, 2025


img

నేడు పొరుగు రాష్ట్రం ఏపీలో పెద్ద పండగ జరుగుతోంది. అది దసరాకి సంబందించింది కాదు. ఆటో డ్రైవర్ల పండగ!

తెలంగాణలో మహాలక్ష్మి పధకంలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆగస్ట్ 15 నుంచి స్త్రీశక్తి పధకం అమలుచేస్తోంది. దాని వలన ఆదాయం కోల్పోయే ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో...’ అనే పేరుతో ఏడాదికి రూ.15,000 చొప్పున అందించే పధకం నేడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు నారా లోకేష్‌ లాంఛనంగా ప్రారంభించారు. 

ఆటో డ్రైవర్ల ఖాతాలలో ప్రభుత్వం డబ్బు జమా చేసి ఊరుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద పండగలా నిర్వహించారు. 

సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతీ ఒక్కరూ కాకీ చొక్కాలు ధరించి ఆటో డ్రైవర్లతో వారి కుటుంబాలతో కలిసి సభా వేదికల వద్దకు ఆటోలలోనే చేరుకున్నారు. అందరూ ఖాకీ చొక్కాలు ధరించి వేదికపై కూర్చోవడంతో అక్కడున్నది తమ వారే అనే భావన ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు కలిగించగలిగారు. 

సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్నప్పుడే ఆటో డ్రైవర్ల ఫోన్లకు “రూ. 15,000 మీ బ్యాంక్ ఖాతాలో జమా అయ్యింది” అంటూ బ్యాంకుల నుంచి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. అవి చూసి వారు ఎంత సంతోషపడి ఉంటారో ఊహించుకోవచ్చు.

ఇప్పుడు ఈ పధకం ప్రకటించి ఎప్పుడో వాయిదాల పద్దతిలో కాకుండా చెప్పిన వెంటనే డబ్బు చెల్లించడంతో వారి నమ్మకాన్ని పొందగలిగారు. రాష్ట్రంలో లక్షలాది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు మరింత దగ్గరయ్యారు. 

ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు తమతో కలిసి ఆటోలో ప్రయాణించడం, అందుకు ప్రతీ ఒక్కరూ వారికి ఆటోచార్జీలు కూడా చెల్లించడం వారి జీవితాలలో ఎన్నటికీ మరిచిపోలేని మధురనుభూతిగా మిగిలిపోతుంది. టీడీపి, జనసేనలకు వీరభక్త ఓటర్లుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు.

 



Related Post