హైదరాబాద్‌ మునిగితే కేసీఆర్‌ మాత్రం ఏం చేయగలిగారు?

October 03, 2025


img

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ నిన్న గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో “గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు,” అని ట్వీట్ చేశారు. 

అంతకు ముందు “హైదరాబాద్ మళ్లీ మునిగింది.. హామీలన్నీ విఫలమయ్యాయి.. అన్నింటినీ గాడిన పెట్టడానికి కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు,” అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తన ఖాతా డిలీట్ చేశారు! 

బహుశః ఆయనకి ఎవరో గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చు. అందువల్లే అకౌంట్ డిలీట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవునో కాదో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే తెలుస్తుంది. 

కానీ ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు దేశంలో ముంబాయి, బెంగళూరు, చెన్నై వంటి అనేక ప్రధాన నగరాలు సైతం ఈ అకాల భారీ వర్షాలకు నీట మునుగుతూనే ఉన్నాయి కదా?హైదరాబాద్‌ ఏమీ ప్లాన్డ్ సిటీ కాదు. దానంతట అది ఈ స్థాయికి ఎదిగింది. కనుక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. 

నాడు కేసీఆర్‌ హయంలో కూడా హైదరాబాద్‌ నీట మునిగింది కదా? అప్పుడు కేసీఆర్‌ మాత్రం ఏం చేయగలిగారు?  ముంపు ప్రాంతాలలో వారికి నష్టపరిహారంగా పదేసివేలు పంచి పెట్టారు. అదీ... జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని! 

ముంపు సమస్యకి ఆయన కూడా శాశ్విత పరిష్కారం చూపలేకపోయారు కదా? కానీ సిఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగింపజేస్తున్నారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమే కదా? కానీ హైడ్రాకు అడుగడుగునా అడ్డుపడుతున్నది ఎవరో రాహుల్ రామకృష్ణకు తెలియనిది కాదు. 

రాహుల్ రామకృష్ణ కనీసం ఊరుకి ఏమైనా మేలు చేశారో లేదో తెలీదు. కానీ గాంధీ మహాత్ముడు దేశానికి ఏం చేశారో అందరికీ తెలుసు. దేశ ప్రజలు గౌరవిస్తున్న అటువంటి మహనీయులపై విమర్శలు లేదా సొంత అభిప్రాయలు వ్యక్తం చేయడం అవసరమా? అని ఆలోచిస్తే బాగుండేది. 


Related Post