కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న జిల్లా కేంద్రంలో జరిగిన దసరా ముగింపు ఉత్సవాలలో సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో తన స్థానంలో తన భార్య నిర్మల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తారని వేలాది మంది సమక్షంలో జగ్గారెడ్డి ప్రకటించారు.
జగ్గారెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కనుక ఎమ్మెల్యేగా నేను మన నియోజకవర్గం అభివృద్ధికి ఏమేమి చేయాలో అన్నీ చేశాను. నా వయసు ఇప్పుడు 59. కనుక ఈసారి ఎన్నికలలో నా భార్య నిర్మల పోటీ చేస్తుంది. ఆమె వెనుకుండి అన్నీ నేను చక్కబెడతాను. నేను మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తాను. అంతవరకు నిర్మల ఎమ్మెల్యేగా కొనసాగుతారు.
అయితే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిపనిచేస్తున్నవారున్నారు. కనుక ఆమె తర్వాత వారికి ఈ మద్యలో అవకాశం లభించవచ్చు,” అని చెప్పారు.
ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కానీ ఇప్పటికే అయన తన కుమార్తె కావ్యని రాజకీయాలలోకి, కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో తండ్రి స్థానంలో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు.
ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈవిదంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇంత ధైర్యంగా తమ కుటుంబ సభ్యులను పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించగలరు. మరే పార్టీలో ఎవరూ ఇంత సాహసం చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చ, ప్రజాస్వామ్యానికి ఇదే గొప్ప నిదర్శనం కాదా?