కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాలోచన?

October 01, 2025


img

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాలోచన చేస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, సుందిళ్ళ బ్యారేజ్‌ల మరమత్తులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ టెండర్లు పిలిచింది. 

ఈ మూడు ప్రాజెక్టులకు మరమత్తులు  చేసేందుకు అర్హత, మంచి అనుభవం, ఆసక్తి గల సంస్థలు టెండర్లు దాఖలు చేయాలని పత్రికా ప్రకటన ద్వారా కోరింది. హైదరాబాద్‌లోని జలసౌధ 6వ అంతస్తులో గల చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి సీల్డ్ కవర్లలో టెండర్లు అందజేయాలని కోరింది. 

టెండర్లు దాఖలు చేసేందుకు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పెట్టింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టెండర్లు తెరుస్తామని పత్రికా ప్రకటనలో పేర్కొంది. పూర్తివివరాలకు https://irrigation.telangana.gov.in/icad/notifications లో చూడవచ్చని తెలిపింది. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కాబోతోంది. ఈ మూడు బ్యారేజ్‌లలో నీళ్ళు నిలువచేస్తే అవి కొట్టుకుపోయి దిగువనున్న గ్రామాలు మునిగిపోతాయంటూ అన్ని గేట్లు ఎత్తేసి ఉంచి వరద నీటిని దిగువకు వదిలేస్తోంది. 

రెండేళ్ళు గడుస్తున్నా బ్యారేజీలకు మరమత్తులు చేయకుండా విచారణ పేరుతో రాజకీయాలు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని బీఆర్ఎస్‌ పార్టీ పదేపదే ఆరోపిస్తూనే ఉంది.     

మరోపక్క కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వ్రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కనుక చివరకి కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వమే చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. బహుశః ఇందువల్లే పునరాలోచన చేసి మూడు బ్యారేజీలకు మరమత్తులు చేయించేందుకు సిద్దపడుతోందా?లేదా మరమత్తులకు ముందుకు వచ్చే కంపెనీలు చెప్పబోయే వివరాలు, అయ్యే భారీ ఖర్చులను హైలైట్ చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందా?లేక బీఆర్ఎస్‌, రైతుల ఒత్తిడి కారణంగా మరమత్తులు చేయించేందుకు సిద్దపడుతోందా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు. 

కానీ మూడు బ్యారేజీలకు మరమత్తులు చేయించడానికి సిద్దపడినా బీఆర్ఎస్‌ పార్టీ విమర్శలు భరించక తప్పదు. మరమత్తులు చేయించి వాడుకోవచ్చని తాము మొదటి నుంచి చెపుతూనే ఉన్నామని కానీ రెండేళ్ళు కాలక్షేపం చేసి ఇప్పుడు చేయిస్తున్నారని విమర్శించకుండా ఉండదు. 



Related Post