బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్, ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఒకవేళ హైకోర్టు బీసీ రిజర్వేషన్స్ తిరస్కరిస్తే? ఏం చేయబోతోంది?అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది.
అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు నాలుగు మార్గాలున్నాయి.
1. హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.
2. పాత రిజర్వేషన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం.
3. ఎన్నికలు వాయిదా వేయడం.
4. గవర్నర్ పక్కన పెట్టిన బీసీ రిజర్వేషన్స్ బిల్లుని ఆమోదింపజేసుకోవడం.
సుప్రీంకోర్టు ఇదివరకే అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదని తీర్పు చెప్పింది. కనుక దీని కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళినా ప్రయోజనం ఉండకపోవచ్చు.
పాత రిజర్వేషన్స్ అంటే బీసీలకు 23, ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్స్ అమలుచేసేందుకు ఎటువంటి అవరోధమూ ఉండదు. కనుక ఈవిదంగా ఎన్నికలు నిర్వహించవచ్చు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఏడాదిన్నర ఆలస్యం అయ్యింది. ఈ కారణంగా పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. కనుక ఎన్నికలు వాయిదా వేస్తే తెలంగాణ ప్రభుత్వమే ఈ అదనపు భారం భరిస్తుండాలి. అది చాలా కష్టం. కనుక ఎట్టి పరిస్థితులలో ఈసారి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం ఖాయమే.
గవర్నర్ వద్ద ఉన్న ఈ పెండింగ్ బిల్లుని ఆయన ఆమోదించరని కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసు. కానీ మరోసారి ప్రయత్నించి, బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వకుండా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్స్‌కి కట్టుబడి ఉందని, అందుకే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్స్ అమలుచేస్తున్నామని ఎన్నికలలో ప్రచారం చేసుకోవచ్చు.