బీఆర్ఎస్‌ పార్టీ వ్యూహం మార్చిందే!

September 16, 2025


img

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్‌ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇంతకాలం వారి రాజీనామాల కోసం కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వంపై రకరకాలుగా ఒత్తిళ్ళు తెచ్చింది. ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో వారు పార్టీని, తమని ఎన్నుకున్న ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్‌ పార్టీ నిరసనలు తెలుపుతోంది. 

మొన్న గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేటీఆర్‌ సమావేశం నిర్వహించి నిప్పులు చెరిగారు. 

నిన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, విని భాస్కర్, నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని రఘునాధపల్లి మండలంలోని కుర్చపల్లిలో బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నేతలు పార్టీ మారిన కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. 

పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలలో ఈవిదంగా ముందుకు సాగుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మరి కాంగ్రెస్‌ పార్టీ ప్రతి వ్యూహం ఏమిటో? 


Related Post