బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి తమ సంజాయిషీలు లిఖితపూర్వకంగా అందజేశారు. వారిలో కొందరు తాము పార్టీ మారలేదని నేటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకోగా కడియం శ్రీహరి వంటి ఒకరిద్దరు మాత్రం రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
స్పీకర్ వారికిచ్చిన గడువు నేటితో ముగిసింది. కనుక వారి విషయంలో స్పీకర్, పీసీసీ అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
ఒకవేళ వారిచేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే ఆ 10 సీట్లను వారు తిరిగి దక్కించుకోలేకపోతే వారి పరువు, కాంగ్రెస్ పరువు కూడా పోతుంది. దమ్ముంటే రాజీనామాలు చేసి గెలిచి చూపండని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే వారిని సవాలు చేస్తున్నారు కూడా. కానీ ఒకవేళ ఉప ఎన్నికలు జరిగి దానిలో ఈ 10 సీట్లని బీఆర్ఎస్ పార్టీ తిరిగి దక్కించుకోలేకపోతే ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. ఈవిషయం కేటీఆర్‌కి కూడా బాగా తెలుసు.
కనుక రెండు పార్టీలకు ఈ ఉప ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు తొందరపడకుండా, తమకు పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పడేవరకు ఈ వ్యవహారాన్ని వీలైనంత వరకు పొడిగిస్తూ కాలక్షేపం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
సుప్రీంకోర్టు స్పీకరుకి మూడు నెలల గడువు విధించినప్పటికీ, స్పీకర్ విచాక్షణాధికారాలను ప్రశ్నించలేదు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ విషయం బాగా తెలుసు. కానీ ఈ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతీరోజూ సవాలు విసురుతూ ఇబ్బంది పెట్టకుండా విడిచిపెట్టదు.