బీఆర్ఎస్ పార్టీ-కల్వకుంట్ల కవిత మద్య జరుగుతున్న గొడవలపై రాష్ట్ర బీజేపి నేతలు వివిధ కోణాల విశ్లేషించారు.
కేంద్ర సహాయ మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్: “తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడంతో కేసీఆర్ పరువు పోయింది. కనుక ప్రజల దృష్టిని దానిపై మళ్ళించడానికే కల్వకుంట్ల కవితతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టింది. తద్వారా అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటారని బీఆర్ఎస్ పార్టీ ఆశ,” అని అన్నారు.
బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు: “బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న అవినీతి సొమ్ము వాటాల పంపకాలలో తేడాలు రావడంతోనే అందరూ రోడ్డున పడ్డారు,” అని అన్నారు.
బీజేపి ఎంపీ రఘునందన్ రావు: “బీఆర్ఎస్ నేతలు అవినీతిపరులని, తమ పార్టీ హయంలో అవినీతి జరిగిందని తొలిసారిగా కల్వకుంట్ల కవిత నిజం చెప్పినందుకు చాలా సంతోషం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరికి ఎంతెంత కమీషన్లు ముట్టాయో కూడా చెపితే చాలా బాగుండేది. ఆమె ఈ విషయం బయటపెడితే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలవడం ఖాయం. ప్రజలు కూడా ఆమె నోటి నుంచి కాళేశ్వరం కమీషన్ కధలు వినాలని ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.
మాజీ మంత్రి విజయ రామారావు: “మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలలో ఒక్క శాతం కూడా మీరు చెప్పలేదు. నాతో సహా జగ్గారెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్... ఎంతో మంది మీ అఘాయిత్యాలు భరించలేక పార్టీ విడిచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో మీరు కూడా చేరారు. ఇంకా ఎంత మంది బయటకు వస్తారో?” అని అన్నారు.