కేసీఆర్‌, హరీష్ రావు నేడు మరో పిటిషన్‌?

September 03, 2025


img

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోమ్ శాఖకు ఓ లేఖ వ్రాసింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకి అనుమతి నిరాకరిస్తూ గతంలో కేసీఆర్‌ జారీ చేసిన జీవోని రద్దు చేస్తూ విచారణకు అనుమతిస్తూ ఓ జీవో  కూడా జారీ చేసింది. 

అయితే ఇది తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కనుక కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కనుక తెలంగాణ ప్రభుత్వ లేఖపై సీబీఐ ఇంకా స్పందించలేదు.   

మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు పీసీ ఘోష్ కమీషన్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరుపవద్దని ఆదేశించింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ విచారణ జరుపాలని అనుకుంటే బహుశః న్యాయస్థానం అడ్డుకోకపోవచ్చు.     

సీబీఐ విచారణ వద్దంటూ హైకోర్టు ఆదేశించినప్పటికీ నేడు మళ్ళీ కేసీఆర్‌, హరీష్ రావు, మాజీ జలవనరుల శాఖ కార్యదర్శి శైలేంద్ర జోషి ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు వేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ మళ్ళీ పిటిషన్లు వేసినట్లయితే వారు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇకపై వారు సుదీర్గమైన న్యాయ పోరాటాలు చేయక తప్పదు. 


Related Post