కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు!

September 02, 2025


img

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్‌ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నష్టం కలిగిస్తుండటాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తీవ్రంగా పరిగణించారని, ఆయన ఆదేశం మేరకు కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇది అందరూ ఊహించిన పరిణామమే కానీ ఇంత రాజకీయ పరిణతి కలిగిన ఆమె సీబీఐ విచారణ గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి తన తండ్రి కేసీఆర్‌కి తెలుసునని చెప్పడం, హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని చెప్పడంతో ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్‌ పార్టీ చేస్తున్న వాదనలన్నీ భూటకమే అని తేల్చి చెప్పేసినట్లయింది.

ముఖ్యంగా హరీష్ రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినందున ఆయనని కాపాడుకోవాలంటే ఆమెను సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి ఆమె స్వయంగా కల్పించుకున్నారు.

ఆమె చెప్పింది వాస్తవమే కావచ్చు. కానీ ఇది ఆమె రాజకీయ జీవితాన్ని తారుమారు చేస్తుంది. తెలంగాణ జాగృతితో ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రజాధరణ లభించడం లేదు. కనుక దాంతో ముందుకు సాగాలేరు. అలాగని కాంగ్రెస్‌, బీజేపిలలో చేరలేరు. కనుక ఇకపై ఆమె రాజకీయంగా ఏవిదంగా ముందుకు సాగుతారో చూడాలి!



Related Post