తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసు విచారణని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడంతో మాజీ సిఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సాయంత్రం తన ఫామ్‌హౌసులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న అర్దరాత్రి వరకు ఈ సమావేశం సాగింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించినందున ఇప్పుడు ఏవిదంగా ముందుకు సాగాలనే విషయంపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఇప్పటికే హైకోర్టులో వేర్వేరుగా కేసులు వేశారు. కమీషన్ రిపోర్ట్ రద్దు చేయాలని, శాసనసభలో ప్రవేశపెట్టకుండా స్టే విధించాలని, ప్రభుత్వం తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలంటూ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఇంకా విచారణ జరుపవలసి ఉంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరిస్తూ కమీషన్ రిపోర్టుని శాసనసభలో ప్రవేశపెట్టడమే కాకుండా సీబీఐ చేత విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ కూడా వ్రాసింది. కనుక హైకోర్టు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవచ్చు.
ఈ నేపధ్యంలో రాజకీయంగా, న్యాయపరంగా ఏవిదంగా ముందుకు సాగాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించుకోవలసి ఉంటుంది. దాని కోసమే నిన్న సమావేశమయ్యారు. ఏం చేయబోతున్నారో నేడో రేపో వారే చెపుతారు.