కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తన తండ్రి కేసీఆర్ ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రెడ్డి ఇద్దరూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వారి కారణంగా దేవుడు వంటి కేసీఆర్‌కి చెడ్డపేరు వచ్చిందని అన్నారు.
వారిరువురూ తనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా సహించానని కానీ వారి కారణంగా తన తండ్రికి అప్రదిష్ట కలగడం భరించలేకనే మాట్లాడుతున్నానని అన్నారు. కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
నాడు హరీష్ రావు అవినీతికి పాల్పడినందునే రెండోసారి ఆయనకి ఆ పదవి ఇవ్వలేదని, మంత్రివర్గంలో తీసుకునేందుకు కూడా కేసీఆర్ జాప్యం చేశారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్లప్పుడూ తెలంగాణ రాష్ట్రం, ప్రజల గురించి మాత్రమే ఆలోచించే కేసీఆర్‌ని శాసనసభలో రేవంత్ రెడ్డి వేలెత్తి చూపిస్తూ అవినీతిపరుడని పదేపదే అంటుంటే తనకు ఎంతో బాధ కలిగిందని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిపే పరిస్థితే వస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత?ఇక నుంచి కేసీఆర్ జోలికి ఎవరు వచ్చినా ఊరుకోనన్నారు. సీబీఐ విచారణ జరిపితే కేసీఆర్ కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్‌తో సహా కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరుగలేదని గట్టిగా వాదిస్తుంటే, హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడటం వలననే కేసీఆర్‌కి చెడ్డపేరువచ్చిందని కల్వకుంట్ల కవిత అంటున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆమె కూడా ద్రువీకరిస్తున్నారన్న మాట!
కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ మీద ఈగ వాలనీయకుండా కాపాడుకుంటానని చెపుతూనే ఈవిదంగా స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని ఏమనుకోవాలి?