కాళేశ్వరం కమీషన్ నివేదికపై మొన్న శాసనసభలో సుదీర్గంగా చర్చించిన తర్వాత ఈ కేసు దర్యాప్తు బాధ్యతని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు తీవ్ర నిరసనలు తెలుసుపుతూ సభ నుంచి వాకవుట్ చేశారు.
దీనిపై కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం. రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఏం జరుగబోతోంది?అనేదే ముఖ్యం.
ఇది రాష్ట్ర రాజకీయాలను ముఖ్యంగా... బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సీబీఐ దర్యాప్తు అంటే ఈ కేసు కేంద్రం చేతిలోకి వెళ్ళినట్లే. కనుక ఇకపై బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఎంత పోరాడినా ప్రయోజనం ఉండదు. కనుక మళ్ళీ మోడీ, అమిత్ షాలపై కత్తులు దూయాల్సి ఉంటుంది.
కత్తులు దూస్తే ఈ కేసు విచారణ ఇంకా వేగవంతం అవుతుంది. కేసీఆర్‌తో సహా పలువురు జైలుకి వెళ్ళాల్సి రావచ్చు. కనుక సిఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఈ గొడవ నుంచి బయటపడుతూనే బీఆర్ఎస్ పార్టీని దాని అధినేత కేసీఆర్‌ని రాజకీయంగా దెబ్బ తీశారని చెప్పవచ్చు.
కల్వకుంట్ల కవితని మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకే బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేసేందుకు కేసీఆర్ సిద్దపడ్డారని ఆమె స్వయంగా బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ కేసులో కేసీఆర్‌తో సహా పార్టీ ముఖ్య నేతలందరూ అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పార్టీని బీజేపి విలీనం చేయకుండా ఉంటారా?లేదా బీజేపితో లోపాయికారిగా పొత్తులు పెట్టుకోకుండా ఉంటారా?అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్ర వినబడుతోంది.
ఒకవేళ ఈ కేసులో కేసీఆర్ తదితరులను సీబీఐ అరెస్ట్ చేసినా లేదా బీజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన కుదిరినా రాష్ట్ర రాజకీయాలలో తదనుగుణంగా మార్పులు జరుగక మానవు.