మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మళ్ళీ నేడు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం దురుదేశ్యపూర్వకంగా శాసనసభలో కాళేశ్వరం నివేదికని ప్రవేశపెట్టి తమ పార్టీని అప్రదిష్ట పాలుజేయాలని ప్రయత్నిస్తోందని కనుక ఆ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టకుండా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని హరీష్ రావు పిటిషన్‌లో కోరారు.
ఇప్పటికే ఆ కమీషన్ నివేదికని రద్దు చేయాలని కోరుతూ తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతోందని హరీష్ రావు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ కేసులో ప్రతివాదులైన పీసీ ఘోష్ కమీషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాగునీటి శాఖ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసుని 5 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసిందని గుర్తు చేశారు.
ఈ కేసు హైకోర్టు విచారణలో ఉన్నందున అంతవరకు ఈ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టకుండా స్టే విధించాలని హరీష్ రావు హైకోర్టుని అభ్యర్ధించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో లేదో తేల్చాల్సింది న్యాయస్థానమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు కాదని హరీష్ రావు అన్నారు.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల చట్టబద్దంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికని బహుశః హైకోర్టు అడ్డుకోకపోవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరుగలేదని గట్టిగా వాదిస్తున్న హరీష్ రావు, కమీషన్ నివేదికపై వరుసగా రెండుసార్లు హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా ఆయన, కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు చాటింపు వేసుకున్నట్లయింది.
మీరు ఏ తప్పు చేయకపోయి ఉంటే కేసీఆర్, హరీష్ రావు శాసనసభ సమావేశాలకు హాజరయ్యి దీనిపై జరిగే చర్చలో తమ వాదనలు వినిపించాలని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే సవాలు చేస్తున్నారు. కనుక ఇద్దరూ హాజరయ్యి తమ వాదనలు వినిపించవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు చేపడితే అప్పుడు హైకోర్టుని ఆశ్రయించినా అర్ధం ఉంటుంది. కానీ కమీషన్ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టక మునుపే హైకోర్టులో కేసులు వేస్తుండటం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది కదా?