గవర్నర్ కోటాలో మళ్ళీ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేరునే సిఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఇదివరకు ఆయన, జర్నలిస్ట్ అమీర్ ఖాన్‌లు గవర్నర్ కోటా నియామితులు కాగా వారి నియామకాలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో కేసు వేసి రద్దు చేయించింది.
కానీ వారం రోజులలోగా మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్‌ని ఎమ్మెల్సీగా చేస్తానని ఇటీవలే సిఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటించారు. అ ప్రకారమే మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజహారుద్దీన్‌ల పేర్లను ఖరారు చేశారు.
వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి లేఖ పంపిస్తుంది. సుప్రీం కోర్టు కేసు నేపధ్యంలో ఆయన వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తారా లేదా?అనే విషయం ఒకటి రెండు రోజులలో తెలుస్తుంది. అప్పుడు వారి నియామకాలపై బీఆర్ఎస్ పార్టీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగబోతోంది. అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని మహమ్మద్ అజహారుద్దీన్ ఇదివరకే ప్రకటించారు. ఇదే పని మీద ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిశారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆయనని ఎమ్మెల్సీగా నియమించబోతున్నారు. ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది కనుక గట్టి పోటీ ఉంటుంది.
కనుక జూబ్లీహిల్స్ నుంచి బలమైన కాంగ్రెస్ అభ్యర్ధిని బరిలో దించడం చాలా అవసరం. కనుకనే అజహారుద్దీన్‌కి ఈ పదవితో పోటీ నుంచి తప్పిస్తున్నారేమో? మరి జూబ్లీహిల్స్ నుంచి ఎవరిని బరిలో దించుతారో చూడాలి.