తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత వారం పదిరోజులుగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత వర్షంలో కూడా యూరియా కోసం క్యూలైన్లో నిలబడక తప్పడం లేదు. ఇటువంటి సమయంలో ప్రజలకు, రైతులకు అండగా నిలబడాల్సిన కాంగ్రెస్ మంత్రులు సచివాలయంలో కూర్చొని అధికారులతో వరద పరిస్థితిపై సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు.
కానీ హరీష్ రావు, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. వీలైన సహాయం అందిస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సచివాలయంలో లేదా మరెక్కడున్నా ప్రభుత్వం తరపున వరద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుండవచ్చు గాక. కానీ ప్రజల కష్ట సమయంలో వారికి అందుబాటులో ఉండాలి... అప్పుడే వారి పట్ల ప్రజలకు నమ్మకం, గౌరవం, అభిమానం కలుగుతాయి.
ఇదివరకు ఏపీలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా సరే ఆయన తక్షణమే బాధిత ప్రజల వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పేవారు. టీడీపి నేతలు కూడా బాధిత ప్రజల వద్దకు వెళ్ళి ధైర్యం చెపుతూ అవసరమైన సహాయ సహకారాలు అందించేవారు.
కనుక ఏపీ ప్రజలు వారికే ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. కానీ జగన్ పట్టించుకోకపోవడం వలన 11 సీట్లతో సరిపెట్టారు.
ఈ విషయం కేసీఆర్ బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే తక్షణం తన పార్టీ నేతలందరినీ వరద బాధిత ప్రజల వద్దకు పంపించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షా సమావేశాలు, ఏర్పాట్లలోనే నిమగ్నమైపోయారు. తద్వారా ప్రజలకు చేరువయ్యే ఈ అవకాశాన్ని చేజేతులా బీఆర్ఎస్ పార్టీకి అప్పగించినట్లయింది.
ఈ నేపధ్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీల పట్ల ప్రజాభిప్రాయం ఏవిదంగా ఉందో తప్పక తెలుస్తుంది.